Thursday, November 29, 2007

జతపరచుము



ఈ జతపరచుము అన్నది నేను ఇంజనీరింగ్ చదువుతున్నపుడు మా కాలేజ్ మ్యాగజైన్ లో నా క్లాస్ మేట్ N.V.J.రామారావు రాసాడు. దాన్ని యధాతధంగా ఇక్కడ ఇస్తున్నాను.
మన ఆకాశవాణి(శోకవాణి) విశాఖపట్నం కేంద్రం వారు ప్రతి కార్యక్రమమును ఒక ప్రత్యేక ప్రయోజనమునాశించి రూపొందించినారు. దిగువ వారు ప్రసారం చేస్తున్న కొన్ని కార్యక్రమములను, వాటి ప్రయొజనములను ఇచ్చిఉన్నాము. ఈ రెండింటిని సరిగ్గా జతపరచి ఆకాశవాణి(శోకవాణి) పై మనకు గల అభిమానమును చాటి చెప్పండి.

అ. కార్యక్రమములు------------ -ఆ. ప్రయోజనములు
1. పుష్పాంజలి ------------------ a. శ్రోతలపై కక్ష సాధింపు చర్య

2. చిత్రతరంగిణి-------------------b. దేవునికి ‘పువ్వుపెట్టు’ కార్యక్రమము

3. పాటల మధ్యలో వ్యాపార---------c. రకరకాలుగా చిత్రవధకు
ప్రకటనలు----------------------- (శ్రోతలను) గురి చేయుఆయుధం

4. యువవాణి -------------------d. శ్రోతల సహనాన్నికొలిచే పరికరం

5. శనివారం నాటిక --------------- e. స్వంత డబ్బా

6. లేఖావళి --------------------- f. పుండు మీద కారం చల్లుట



జవాబులు
1-b, 2-c, 3-f, 4-a, 5-d, 6-e

Wednesday, November 28, 2007

అమెరికా సామ్రాజ్య ( చమురు ) దాహం

జాన్ పెర్కిన్స్ రాసిన ఒక దళారీ పశ్చాత్తాపం (Confessions of An Economic Hit Man) చదివాను. ఒక విధమయిన బాథకు లోనయ్యాను.
నేను ఇన్నాళ్ళు మన నాయకులే అప్పులు సరిగ ఖర్చు చేయటం లేదు అనుకునేదాన్ని. కానీ ఈ అప్పులు నిజంగా అభివృద్ద్డి కోసం కాదని కొన్ని బహుళజాతి కంపెనీలకు, కొంతమంది ధనవంతుల జేబుల్లోకి తరలించే ప్రక్రియ అని తెలుసుకుని నివ్వెరపోయాను.
అమెరికా ప్రయోజనాలు నెరవెర్చే ఒక వ్యవస్థలొ భారీ విదేశీ ౠణాలగురించి దేశాధ్యక్షుల్ని ఒప్పించి కొన్నాళ్ళకు ఆ దేశాలను అప్పులవలయంలో చిక్కేటట్లు చేసి వారిని బానిసలుగామార్చి అమెరికా ఆర్ధిక, రాజకీయ, సైనిక అవసరాలు తీర్చే బంట్లుగా మార్చడమే ఈ Economic Hit Man పని అని తెలుసుకుని నివ్వెరపోయాను.
నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటి గూఢచారి సంస్థలు Economic Hit Man (EHM) గా నియమించదగిన వారిని గుర్తిస్తాయి. ఆ తరువాత ఆ EHM ను ఏ ప్రైవేటు అంతర్జాతీయ బహుళజాతి కార్పొరేషనో ఉద్యోగంలోకి తీసుకుంటుంది. వాళ్ళు జీతాలు ప్రైవేటు కంపెనీల నుండి తీసుకుంటారు. పనులు మాత్రం అమెరికన్ సామ్రాజ్యవాదులకు పనికివచ్చేవే చేస్తారు. ఒకవేళ ఎప్పుడైనా ఈ కుట్ర బైటపడినా ఇదేదో బహుళజాతి కంపెనీల దురాశకు సంబంధించినవ్యహారమని నలుగురిని నమ్మించవచ్చు. తద్వారా న్యాయపరమైన చిక్కుల నుండి కూడా తప్పించుకోవచ్చు.
EHM పని గ్లోబల్ సామ్రాజ్యాన్ని నిర్మించడం. అంతర్జాతీయ ద్రవ్యసంస్థల తోడ్పాటుతో ప్రపంచ దేశాలను అమెరికా బహుళజాతి కంపెనీలకు, వాళ్ళ ప్రభుత్వానికి, వాళ్ళ బ్యాంకులకి దాసోహమయ్యేలా చేసే అత్యున్నత ఉద్యోగం. అభివృద్ద్డి చెందుతున్న(చమురు నిల్వలున్న) దేశాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, రహదారులు, రేవులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కుల అభివృద్ద్డి చెయ్యడం కోసం ఇచ్చే అప్పులు వాళ్ళ దేశానికి చెందిన ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థలకే ఆ ప్రాజెక్టులు నిర్మించే కాంట్రాక్టులు ఇవ్వాలనే షరతు ఉంటుంది. అభివృద్ద్డి చెందుతున్న దేశాలకిచ్చే అప్పులో అధిక భాగం అమెరికా వదలి వెళ్ళదు. ఆ డబ్బు కేవలం వాషింగ్టన్ బ్యాంకు ఆఫేసులనుండి న్యూయార్క్, హూస్టన్ లేదా శాంఫ్రాన్సిస్కో నగరాల్లోని ఇంజనీరింగ్ ఆఫీసులకు మారుతుంది. ఈ ప్రోజెక్టులన్నీ అమెరికా దేశపు కాంట్రక్టర్ల కంపెనీల జేబులు నింపేవే అంతేకాదు లబ్ధి పొందిన దేశంలో గుప్పెడు డబ్బున్న, అధికారమున్న వ్యక్తులకు ఈ డబ్బులో వాటా దక్కుతుంది. కంపెనీఅప్పు తీసుకున్న దేశం మాత్రం వడ్డీతో సహా అప్పు తిరిగిచెల్లించాల్సిందే. దేశంలో కేవలం ఒక్క వ్యక్తి ఓ పెద్ద కంపెనీ యజమాని డబ్బులు సంపాదించి మిగతా ప్రజానీకం అంతా పేదరికంలో మగ్గినా GDP పెరుగుదల నమోదు చెయ్యవచ్చు. ధనికులు ఇంకా ధనికులవుతారు. పేదవారు ఇంకా పేదరికంలోకి నెట్టివేయబడతారు. EHM తన పనిలో సఫలీకృతం అయితే ఈ అప్పులు తిరిగిచెల్లించలేనంత భారీ మొత్తంలో ఉంటాయి. కొన్నేళ్ళకే ఆదేశం ఈ అప్పుల వాయిదాలు కట్టలేని దశకు చేరుకుంటే అప్పు ఇచ్చిన వాడు కొన్ని కోరికలు కోరతాడు. అవి ప్రధానంగా ఐక్యరాజ్యసమితిలో వాళ్ళ తీర్మానాలకు మద్దతుగా ఓట్లు, సైనిక స్థావరాలు నెలకొల్పడానికి అనుమతులు లేదా విలువైన చమురులాంటి సహజసంపదలపై నియంత్రణ. వాళ్ళ కోరికలు తీర్చినా బాకీ పడ్డ సొమ్ము మాత్రం అలాగే ఉంటుంది.
ఇవ్వళ బూట్ల తయారీ కంపెనీల నుండి భారీయంత్రసామాగ్రి తయారుచేసే కంపెనీల వరకు ప్రతి కంపెనీలో Economic Hit Man వంటివారు ఉన్నారు.
తమ లాభాల లక్ష్యం చేరడానికి ఏమార్గం పట్టినా తప్పులేదన్నది వారి సిద్ధాంతం.
ఈ సిద్ధాంతం పరాయి వనరులను దోపిడీ చేయడం తో ఆగలేదు. ఆ దేశాలు అందుకు ఒప్పుకోకపోతే ఆయా దేశాలమీద దౌర్జన్యం చెయ్యటం లేదా ఆ దేశ నాయకుల్ని బెదిరించడం చంపించడం. ఈక్వెడార్ అధ్యక్షుడు జైమె రోల్డోస్, పనామా అధ్యక్షుడు ఒమర్ టోరిజోన్ అలా ఎదిరించి ప్రాణాలు పోగొట్టుకున్నారు.
పనామా అధ్యక్షుడు ఒమర్ టోరిజోన్ చేసిన నేరమల్ల గుప్పెడుమంది అమెరికన్ ప్రభుత్వ పెద్దలను, బహుళజాతి కంపెనీల ప్రతినిధులను వ్యతిరేకించడమే. తన దేశంలో ఒక కాలువను తనకు నచ్చిన వారితో నిర్మింపచేసుకోవలనే ఆకాంక్షలను వ్యక్తపరచడమే.
ఇరాన్ లో మొస్సాదెగ్ ప్రభుత్వాన్ని CIA కూల్చేసింది, వెనిజులా, ఈక్వెడార్, పనామా, ఇండోనేషియా, గ్వటిమాలా నిన్నమొన్న ఇరాక్ లో ఎక్కడైనా ప్రధాన వనరు “చమురు”.
ఇదంతా చదివిన తర్వాత దీనికిమార్గమేమిటి? పెట్రోల్ , డీజిల్ వ్యయాన్ని తగ్గించుకోవడం. షాపింగ్ చేయాలనిపించినపుడు దానికి బదులుగా ఓ పుస్తకం చదవడం, వ్యాయామం చెయ్యడం లేదా ధ్యానం చెయ్యడం. ఇంట్లో, ఆఫీసులో వీలైనంత తక్కువ సామాన్లు ఉండేలా చూడండి. స్వేచ్ఛా మార్కెట్లను, శ్రమశక్తిని, పర్యావరణాన్ని దోపిడీ చేసే బహుళజాతి కంపెనీలను వ్యతిరేకించండి. ఇప్పుడు జరుగుతున్న తప్పుకు కారణం కొన్ని సంస్థలు కాదు. ఆర్ధిక ప్రగతి గురించి కొద్దిమంది వ్యక్తులకున్న తప్పుడు భావాలే ప్రస్తుత పరిస్తితికి కారణం. సంస్థ పనిచేసేతీరులోనే తప్పంతా ఉంది. వృధాగా డబ్బు తగలేసే వారిని చూసి జాలిపడాలేగాని వారిని అనుకరించగూడదనీ, పెంట్ హౌస్ లు, ఖరీదైన పడవలూ ఆనందాన్నివ్వలేవని మనం తెలుసుకోవాలి మన ముందు తరాలకి నేర్పాలి.
ప్రతిఒక్కరూ తప్పక చదివి తీరాల్సిన పుస్తకం. చదివితే అమెరికా అన్నిటినీ వ్యవస్థీకృతం చేసిందన్న విషయం అర్థం అవుతుంది.

Tuesday, November 20, 2007

నా కొత్త బ్లాగు

తెలుగు బ్లాగర్లకు వందనాలు. ఇది నా మొదటి బ్లాగు. నేను మొట్టమొదట చదివిన బ్లాగ్ సుధాకర్ గారి శోధన.నాకు ఎంతగానో నచ్చింది. నాకు కూడా రాయాలని అనిపించింది. కానీ అదంత సులువు కాదని తెలిసింది. మనం మట్లాడుతుంటే అక్షరాలు తెర మీద వచ్చెస్తే ఎంత బాగుంటుందనిపించింది.నాకు హాస్యం అంటే ఇష్టం. నేను కూడా నా ఆలోచనలని మీతో పంచుకుంటాను.